అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. ఆదివాసీల సాంప్రదాయ కొమ్ము నృత్యాల మధ్య ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఎన్టీఆర్ ట్రస్ట్, జీఎస్ఎల్ మరియు జీఎస్ఆర్ ఆసుపత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

రంపచోడవరంలోని యూత్ సెంటర్‌లో మొత్తం 12 రకాల వైద్య సేవలను భువనేశ్వరి అందుబాటులోకి తెచ్చారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 29 ఏళ్లుగా ట్రస్ట్ సేవలు అందిస్తోందని భువనేశ్వరి తెలిపారు. ఇప్పటివరకు 16,365 హెల్త్ క్యాంపుల ద్వారా 22.64 లక్షల మందికి వైద్య సేవలు అందించామని, రూ.22.97 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశామని వివరించారు. అనాథ పిల్లల విద్య కోసం రూ.3.50 కోట్ల స్కాలర్‌షిప్‌లు అందించామని, నాలుగు బ్లడ్ బ్యాంకుల ద్వారా 9.18 లక్షల మందికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడామని ఆమె పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ ట్రస్ట్, దాతల సహకారంతో పేదల కోసం నిరంతరం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, మాజీ ఎమ్మెల్యేలు మరియు పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు
