పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రముఖ విద్యావేత్తపై జరిగిన హత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎస్.ఎస్.ఎన్ (SSN) కళాశాల ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేటలోని భావన కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ మైనిడి శ్రీనివాసరావు.

సోమవారం ఉదయం శ్రీనివాసరావు ఎస్.ఎస్.ఎన్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా, ముఖానికి మంకీ క్యాప్ ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తితో ఆయనపై దాడికి తెగబడ్డాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును వెంటనే స్థానిక మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంకీ క్యాప్ ధరించి వచ్చిన వ్యక్తి కోసం సిసిటివి (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
