శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు సైదాపురంలో వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో జరిగిన పేకాట దాడిలో పోలీసులు అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అటవీ ప్రాంతంలో మొత్తం 13 మంది పేకాడుతుండగా, పోలీసులు కేవలం ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని ధారాళంగా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “వాళ్లను వదిలేసి మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు?” అని ప్రశ్నించిన ఒక పేకాటరాయుడిని పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు సమాచారం.

స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఒక స్కూటర్, ఒక ఆటోను స్టేషన్ నుంచి రాత్రికి రాత్రే వదిలేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను కూడా బేరసారాల తర్వాత తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.MLAల అనుచరుడినని చెప్పుకునే ఒక స్థానిక దళారీ ద్వారా పోలీసులు రాయబేరాలు నడిపి, భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కోడిపందేల కేసులను అటకెక్కించినట్లుగానే, ఈ కేసును కూడా నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.క్రమశిక్షణ తప్పిన సైదాపురం పోలీసింగ్పై ఉన్నతాధికారులు దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
