జిల్లాలోని నిజాంపట్నం హార్బర్లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. జెట్టీ వద్ద నిలిపి ఉంచిన ఒక భారీ చేపల వేట బోటులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. బోటులో ఉన్న డీజిల్, వలలు వంటి మండే స్వభావం గల వస్తువులు ఉండటంతో మంటలు క్షణాల్లో బోటు అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి గురైన బోటు సున్నంపూడి గోవిందరాజులు అనే మత్స్యకారుడికి చెందినదిగా గుర్తించారు. మంటల్లో బోటుతో పాటు లోపల ఉన్న ఖరీదైన వలలు, ఇతర సామగ్రి పూర్తిగా బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు ₹50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. మంటలు చెలరేగగానే బోటులో ఉన్న వారు వెంటనే కిందకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
