ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన గ్రామానికి వస్తున్నారు. ముఖ్యంగా నాడు కన్నీరు మున్నీరైన వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ వెళ్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గతంలో బాధితులను పరామర్శించిన సమయంలో “మీ ఇంటికి వస్తాను” అని ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ ఈరోజు నిలబెట్టుకుంటున్నారు.”పవన్ మా ఇంటికి రావడం నా అదృష్టం. ఆయన కోసం నా ప్రాణమైనా ఇస్తాను.

నా సొంత కొడుకుల కన్నా పవన్ కళ్యాణే నాకు ఎక్కువ ఇష్టం” అంటూ నాగేశ్వరమ్మ భావోద్వేగానికి లోనయ్యారు.”పవన్ రాగానే ఏం తింటారో అడుగుతాను.. ఏది అడిగినా ఒక్క నిమిషంలో వండి పెడతాను” అని ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి.

ఇప్పటం పోరాటం జనసేన పార్టీకి ఎంతో కీలకం. ఆనాడు ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసినప్పుడు పవన్ నేరుగా అక్కడికి వచ్చి అండగా నిలబడ్డారు. నేడు డిప్యూటీ సీఎం హోదాలో అదే ప్రజల వద్దకు వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
