కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గాడిమోగ నదీ తీరంలో జరిగిన చమురు లీకేజీ ఘటనతో మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభావిత మత్స్యకారులను తక్షణమే ఆదుకోవాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అధికారులను ఆదేశించారు.
కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ఓఎన్‌జీసీ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాట్లాడుతూ—ఘటనపై శాస్త్రవేత్తల బృందం సమగ్ర నివేదిక సిద్ధం చేసిందని, అయితే ఆ నివేదికతో పాటు ప్రతి మత్స్యకారుడికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని పరిహారం అందించేందుకు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా మరియు ఓఎన్‌జీసీ అధికారులకు సూచించినట్లు తెలిపారు.
లీకేజీ కారణంగా నష్టపోయిన మత్స్యకారులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎంపీ హరీష్ బాలయోగి హామీ ఇచ్చారు.

