శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులు మార్కెట్‌కు అనుగుణంగా లాభదాయక పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రూరల్ మండలం ఖాజీపేట, పొన్నాడ గ్రామాల్లో పర్యటించిన ఆయన, ధాన్యం సహా ఇతర పంటల సాగు–అమ్మకాలపై రైతులతో మాట్లాడారు.
పండిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ధాన్యానికి మద్దతు ధర అందుబాటులో ఉండగా దళారీలకు అమ్మవద్దని రైతులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 29 వరకు ‘రైతన్న–మీకోసం’ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రైతులు పాత పద్ధతులను మార్చి, కొత్త లాభసాటి పంటల సాగు వైపు వెళ్లేలా అవగాహన కల్పిస్తామని, ఎరువులు–పురుగుమందుల వాడకాన్ని తగ్గించే దిశగా పనిచేస్తామని చెప్పారు. ‘పంచసూత్రాల’ అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.

రైతు సేవా కేంద్రం నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్‌తో సహా ఆరుగురు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు మార్గనిర్దేశం చేస్తారని, ప్రకృతి వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పొన్నాడ వంకాయకు మరింత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రైతుల వివరాలు సేకరించనున్నట్లు చెప్పారు.
