పట్టణాల్లో పౌర సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పురమిత్ర’ (Puramithra) యాప్ మరింత శక్తివంతంగా మారింది. మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలపై తక్షణమే స్పందించేలా ఒక కొత్త ‘ఆరెంజ్ కలర్ హాట్‌స్పాట్’ (Orange Hotspot) ఫీచర్‌ను జోడించారు.
ఒకే ప్రాంతంలో, ఒకే రకమైన సమస్యపై (ఉదా: డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు) కనీసం 5 ఫిర్యాదులు నమోదైతే, అది మున్సిపల్ కమిషనర్ డాష్‌బోర్డులో ‘ఆరెంజ్’ రంగులో మెరుస్తుంది.
ఇలా ఆరెంజ్ రంగులో కనిపించే ప్రాంతాలను ‘హాట్స్పాట్లు’గా పరిగణిస్తారు. కమిషనర్లు తమ ఉదయకాల క్షేత్ర పర్యటనల్లో (Morning Inspections) వీటికి మొదటి ప్రాధాన్యతనిచ్చి, స్వయంగా వెళ్లి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. కమిషనర్లు నిజంగా క్షేత్రస్థాయికి వెళ్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
ప్రజల డిమాండ్ మున్సిపాలిటీల్లో అమలవుతున్న ఈ ‘పురమిత్ర’ సేవలు సత్ఫలితాలనిస్తుండటంతో, ఇదే తరహా వ్యవస్థను గ్రామ పంచాయతీల్లోనూ ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని ప్రజలు కోరుతున్నారు.
