నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని అరుంధతి వాడ నివాసులు మురుగు నీటి మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా పడకేయడంతో డ్రైనేజీ కాలువలన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి, మురుగునీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది.
మురుగు కాలువకు అతి సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రం ఉండటంతో చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీరు నిల్వ ఉండటంతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. పారిశుద్ధ్య సిబ్బంది తమ కాలనీ వైపు కన్నెత్తి చూడటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు.తక్షణమే అధికారులు స్పందించి కాలువల్లోని పూడికను తొలగించాలని, అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.
