కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత ఆధ్యాత్మిక ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 1:25 గంటలకు ఆలయ వైకుంఠ ద్వారాలు (ఉత్తర ద్వారం) తెరుచుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి, మంగళవారం తెల్లవారుజామున తన సతీమణి, కుమార్తె, మనవడు మరియు ఇతర బంధువులతో కలిసి వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు.
ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు మరియు అధికారులు ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
సీఎంతో పాటు పలువురు ప్రముఖులు, వీఐపీలు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8, 2026 వరకు పది రోజుల పాటు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పటిష్టమైన భద్రత మరియు మౌలిక సదుపాయాలను కల్పించింది. జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని భక్తుల కోసం సర్వదర్శనం కల్పించనున్నారు.
