రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 22A నిషేధిత భూముల సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం శాసనసభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, 22A జాబితా నుండి భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని ప్రకటించారు.
జిల్లా కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో 22A భూముల సమస్య పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపడతారు. ఇప్పటికే ఐదు రకాల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు మెమో జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూములను 10 ఏళ్ల తర్వాత విక్రయించుకునే అవకాశం ఉందని, అయితే నీటి వనరులు ఉన్న భూములను మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారం సంరక్షిస్తామని స్పష్టం చేశారు.సామాన్యులు, పేదలకు లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
