రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్థులకు ఆధార్ సేవలు అందించేందుకు ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళవారం (నేటి నుంచి) నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు, తిరిగి 22 నుంచి 24వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించబడతాయి. గతంలో నవంబరులో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా, ముఖ్యంగా బయోమెట్రిక్ అప్‌డేట్ మిగిలి ఉన్న పిల్లలు, విద్యార్థుల కోసం ఈ క్యాంపులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,51,271 మంది విద్యార్థులు ఉండగా, గత క్యాంపులో 3,34,599 మంది నమోదు చేసుకున్నారు. ఇంకా 13,16,672 మంది విద్యార్థులు ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది.
మిగిలిన విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ విజ్ఞప్తి చేసింది.
