నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నుండి 84.29 శాతం స్కోరుతో క్వాలిటీ సర్టిఫికేషన్ సాధించింది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించి, వైద్యాధికారులు మరియు కమిటీ సభ్యులను అభినందించారు.
రాష్ట్రంలో కేవలం రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు జాతీయ గుర్తింపు పొందితే, అందులో వెంకటాచలం ఒకటి కావడం గర్వకారణమని సోమిరెడ్డి పేర్కొన్నారు.

సుమారు రూ. 70 లక్షల సీఎస్‌ఆర్ (CSR) నిధులతో ఆసుపత్రిలో కంప్యూటర్లు, జనరేటర్లు, ఏసీలు మరియు ఆర్వో ప్లాంట్ వంటి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.ఏడు మండలాల ప్రజలకు ఉపయోగపడేలా పొదలకూరులో 8 బెడ్ల డయాలసిస్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీనికి మంత్రి సత్యకుమార్ యాదవ్ పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో రూ. 20 కోట్లతో నిర్మించనున్న 50 బెడ్ల ఆసుపత్రి మరియు నర్సింగ్ స్కూల్‌కు ఇప్పటికే భూమిపూజ చేశామని వెల్లడించారు.పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
