భూమి అనేది తాతల తండ్రుల నుంచి వచ్చే ఆస్తి అని, దానిపై పాలకుల ఫోటోలు ఉండాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. నర్సీపట్నం మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.

గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై రాజకీయ నేతల ఫోటోలు ముద్రించి వ్యవస్థను గాడి తప్పించిందని అయ్యన్న విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారిక చిహ్నమైన ‘రాజముద్ర’ తోనే పుస్తకాలను జారీ చేస్తోందని తెలిపారు.కొత్త పాస్ పుస్తకాలపై QR కోడ్ సదుపాయం కల్పించారు. దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్, భూ అక్రమాలకు తావుండదని, ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే భూమి వివరాలన్నీ కనిపిస్తాయని వివరించారు.

ఈ ఒక్కరోజే నర్సీపట్నంలో 16,209 పుస్తకాలు సిద్ధం చేశామన్నారు. రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారానే వీటిని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూ రీ-సర్వేలో తప్పులను సరిదిద్ది రైతులకు శాశ్వత భూహక్కు కల్పిస్తామని స్పీకర్ పేర్కొన్నారు
