వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ మరియు సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు భారీ ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్.బి. బంగ్లా జంక్షన్ నుంచి ప్రదర్శన నిర్వహించారు.
కనీస వేతనం అంగన్వాడీలకు రూ. 26,000/- కనీస వేతనం ఇవ్వాలి. స్కీం కార్మికులకు 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో పాటు కూటమి ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, గ్రాట్యూటీ జీఓ నెం. 8 కు మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. లబ్ధిదారులకు క్వాంటిటీ, పెరిగిన ధరలకనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలి. ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచి, ఉచిత గ్యాస్ సరఫరా చేయాలి. మిగిలిన మినీ సెంటర్లను వెంటనే మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం నివారించి, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి.
ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ సెంటర్ల విలీనం నిర్ణయాన్ని విరమించుకోవాలి. యాప్ల సంఖ్య తగ్గించి, ఒకే యాప్ అమలు చేయాలి. ఎఫ్.ఆర్.ఎస్ రద్దు చేయాలి.
ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు కె. కళ్యాణి, డి.సుధ తదితరులు పాల్గొన్నారు.
