పెళ్లి అంటే నూరేళ్ల పంట అని నమ్మే అమాయక వరులను బురిడీ కొట్టిస్తూ, మూడు ముళ్ల బంధాన్ని కాసుల వేటగా మార్చుకున్న ఓ కిలేడీ ఉదంతం శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. కేవలం 19 ఏళ్ల వయసులోనే 8 మందిని వివాహం చేసుకుని మోసగించిన ముత్తిరెడ్డి వాణి బాగోతం తాజాగా బయటపడింది.ఇచ్చాపురం కర్జీ వీధికి చెందిన వాణి తన మేనత్త సంధ్యతో కలిసి ఈ దందాకు తెరలేపింది. పెళ్లికాని యువకులను ఎంచుకుని, వారితో సంబంధం కుదుర్చుకుని ‘ఎదురు కట్నం’ వసూలు చేయడం వీరి స్టైల్. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని సోంపేట ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వరుడితో కలిసి రైలులో కర్ణాటక వెళ్తుండగా, విజయనగరం స్టేషన్ వద్ద బాత్ రూమ్ నెపంతో తప్పించుకుని పరారైంది. నిందితురాలు వరుడి వద్ద నుంచి లక్ష రూపాయల నగదుతో పాటు నగలు, బట్టలు తీసుకుని జంప్ అయ్యింది. బాధితులు ఆరా తీయగా ఆమెకు ఇదివరకే 7 పెళ్లిళ్లు అయ్యాయని తెలిసి కంగుతిన్నారు. బాధితులు నాగరెడ్డి, కేశవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఇచ్చాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వాణి గతంలో మైనర్ కావడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు బాధితులు ఆమె 8 పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆధారాలుగా సమర్పించారని పోలీసులు తెలిపారు.
AP ఇచ్చాపురంలో ‘నిత్య పెళ్లికూతురు’ 19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు
