తక్కువ సొమ్ము ఇస్తే ఎక్కువ ‘బ్లాక్ మనీ’ ఇస్తామంటూ నమ్మబలికి, అమాయకులకు నకిలీ నోట్ల కట్టలను అంటగడుతున్న ముఠా గుట్టును కాశీబుగ్గ పోలీసులు రట్టు చేశారు. కేవలం పది లక్షల అసలు కరెన్సీ తీసుకుని, 50 లక్షల నకిలీ పేపర్ కట్టలతో బురిడీ కొట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పలాసకు చెందిన కారు డ్రైవర్ జెన్నా సునీల్ కుమార్, మరో వ్యక్తితో కలిసి ఎల్. లచ్చుమయ్య అనే వ్యక్తిని సంప్రదించారు. రూ. 10 లక్షల అసలు కరెన్సీ ఇస్తే, బదులుగా రూ. 50 లక్షల బ్లాక్ మనీ (పాత నోట్లు లేదా కమిషన్ బేసిస్) ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ నెల 8వ తేదీన మొగిలిపాడు బ్రిడ్జ్ వద్ద బాధితుడి నుంచి రూ. 10 లక్షలు తీసుకుని, అతడికి 50 లక్షలు ఉన్నాయని చెబుతూ ఒక బ్యాగ్ ఇచ్చి నిందితులు పరారయ్యారు. బాధితుడు ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరిచి చూడగా, అందులో నోట్లకు బదులు కేవలం తెల్లకాగితాల కట్టలు (ప్రింటెడ్ పేపర్లు) ఉండటంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి, నిందితుడు సునీల్‌ను అమరావతి డాబా వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 4.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రెండో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
