పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక నిండు ప్రాణం బలయ్యింది. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి (NH-565) పై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం పెద్దపులిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పులి అక్కడికక్కడే మృతి చెందింది.
విజయపురి సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుజాత తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయపురి సౌత్ రేంజ్ పరిధిలో ఉన్న మొత్తం నాలుగు పెద్దపులుల్లో ఒకటి మృతి చెందడం అటవీ శాఖను కలిచివేసింది. పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అభయారణ్యాల గుండా వెళ్లే జాతీయ రహదారులపై జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుందని, అక్కడ వేగ నియంత్రణ బోర్డులు, హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు
