ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ నటరాజ స్వామి వారి ఆలయంలో ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

తెల్లవారుజామున 4:00 గంటలకే స్వామి వారి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. అనంతరం మూలమంత్ర హవనం, మంటప పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10:00 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. అనంతరం ధ్వజారోహణ మహోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బోర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈఓ రామచంద్ర మోహన్ (శీనానాయక్), ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, స్థానాచార్య శివప్రసాద శర్మ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను మాడవీధులలో ఊరేగిస్తూ నగరోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
