విలువలతో కూడిన విద్యే శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అని విద్య–ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ కాన్వకేషన్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, సీఎం చంద్రబాబునాయుడు గౌరవ అతిథిగా హాజరయ్యారు.
లోకేష్ మాట్లాడుతూ పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో భగవాన్ సత్యసాయి ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తుందని అన్నారు. రాయలసీమ ధైర్యం, త్యాగం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. విలువల ఆధారిత విద్య, సమగ్ర వ్యక్తిత్వ వికాసం, సమాజ సేవా భావం ఈ విశ్వవిద్యాలయ ప్రత్యేకతలని అభివర్ణించారు.
“Love All, Serve All”, “Help Ever, Hurt Never” వంటి బాబా సూక్తులను జీవితంలో ఆచరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. భవిష్యత్ నాయకులుగా దేశ అభివృద్ధికి సేవ చేయాలని సూచించారు.
కాన్వకేషన్ సందర్భంగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ సాయికుల్వంత్ మందిరంలో బాబా మహాసమాధిని దర్శించి, వివిధ కోర్సుల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్స్‌లర్ కె. చక్రవర్తి, వైస్ ఛాన్స్‌లర్ బి. రాఘవేంద్ర ప్రసాద్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





