మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వామపక్ష పార్టీలు సమరశంఖం పూరించాయి. సోమవారం విశాఖ జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం మరియు ఇతర వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. కేంద్రం తన వాటాను తగ్గించడం వల్ల ఉపాధి హామీ చట్టం ఉనికి కోల్పోతుందని, దీనివల్ల ఏపీపై ఏటా రూ. 4,000 కోట్ల అదనపు భారం పడుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, సీపీఎం నేత పి. మణి విమర్శించారు.పాత చట్టాన్ని రద్దు చేసి తీసుకువచ్చిన కొత్త ‘జీరాంజీ’ పథకం కేవలం కార్పొరేట్ల దోపిడీకి మాత్రమే ఉపయోగపడుతుందని, గ్రామీణ పేదలను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. కేంద్ర కూటమిలో ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంలో మౌనం వీడాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పాత చట్టాన్ని యథాతథంగా కొనసాగించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కే. సత్యనారాయణ, ఎం. కృష్ణారావు, కే. దేవా సహా పెద్ద సంఖ్యలో వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు.
