పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సామాజిక సేవలోనూ భాగస్వాములు కావాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఆయన 2-టౌన్ లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. పండితుల వేదమంత్రోచ్చరణలు, పూర్ణకుంభం నడుమ సీపీకి అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వృద్ధులకు కంటి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, సీపీ చేతుల మీదుగా పండ్లు, నిత్యావసర వస్తువులను (బకెట్లు, మగ్గులు) పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు.

మహిళా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. డయల్ 100 కాల్ రాగానే నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకోవాలి. దొంగతనాల నివారణకు సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహించాలి. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతం చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి. ఈ కార్యక్రమంలో డీసీపీ మణికంఠ చందోలు, ఏసీపీ లక్ష్మణమూర్తి, సీఐ ఎర్రం నాయుడు మరియు స్థానిక కార్పొరేటర్లు కందుల నాగరాజు, బీశెట్టి వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
