విశాఖ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే పూర్ణమార్కెట్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరు పూజా సామాగ్రి దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ఒక పూజా ద్రవ్యాల షాపులో మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలోనే పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానిక వ్యాపారులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన అక్కడికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడం, ఆ సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సుమారు ఆరు షాపులు పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
