కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహం విశాఖ ఉక్కు పరిశ్రమకు పునర్జీవం పోసింది. కేవలం ఏడాదిన్నర కాలంలోనే నష్టాల నుంచి గట్టెక్కిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL), 2026 జనవరి నెలలో రూ. 54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు ప్లాంట్ పురోగతిపై అధికారులతో చర్చించారు.
గత ఏడాది కేవలం 45 శాతంగా ఉన్న కెపాసిటీ యుటిలైజేషన్, ఇప్పుడు రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరుకుంది.ప్రస్తుతం మూడు బ్లాస్ట్ ఫర్నెస్ లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండటంతో రోజుకు 19,401 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది 2024-25 నాటి ఉత్పత్తి (9,215 టన్నులు) కంటే రెట్టింపు. కేంద్రం అందించిన రూ. 11,440 కోట్ల ఆర్థిక సాయం, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, పన్నులు, నీటి బకాయిల విషయంలో అందించిన సహకారం ప్లాంట్‌ను నిలబెట్టాయి.ప్లాంట్ పనితీరు మెరుగుపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో సంస్థ క్రెడిట్ రేటింగ్ కూడా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
“కార్మికులు, అధికారుల పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది. సింగరేణి తరహాలోనే విశాఖ ఉక్కును కూడా ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దుతాం” అని CM చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
