నగరంలోని సూపర్ బజార్ ప్రాంగణంలో ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, ప్రజలకు అందుతున్న సేవలపై ఆయన స్వయంగా ఆరా తీశారు.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, మధ్యవర్తులు లేదా దళారుల ప్రమేయం లేకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.స్టాంప్ డ్యూటీ వసూళ్లు, పత్రాల నమోదు విధానం, స్లాట్ బుకింగ్ పద్ధతులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. కార్యాలయంలో వేచి ఉన్న దరఖాస్తుదారులతో కలెక్టర్ మాట్లాడి, సిబ్బంది పనితీరు మరియు సేవల నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదని, ప్రతి ఒక్కరికీ సమానంగా, వేగంగా సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.ఈ తనిఖీలో జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కనకరత్నం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
