మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల అంబటి రాంబాబు అరెస్ట్, ఆయన ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపట్లో గుంటూరుకు చేరుకోనున్నారు.
జగన్ రాకతో అంబటి ఇంటికి భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతోంది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంబటి నివాసం వైపు వెళ్లే రహదారులపై నిఘా ఉంచారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు, ధ్వంసమైన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ పరిశీలించనున్నారు.ఈ పర్యటన గుంటూరు రాజకీయాల్లో మరింత వేడిని పెంచింది.
