రాయలసీమ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి సీమకు అన్యాయమే జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేవగౌడను ప్రధానిని చేశానని చెప్పుకునే చంద్రబాబు, ఆయన హయాంలో ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచుతుంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు.

కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా 150 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెలంగాణ, మహారాష్ట్రలు కోర్టుకు వెళితే, చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కర్ణాటక వైఖరి వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సహా అన్ని ప్రాజెక్టులు దెబ్బతింటాయని, భవిష్యత్తులో తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్, జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టులు కడుతుంటే టీడీపీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించడం చంద్రబాబుకు అలవాటని దుయ్యబట్టారు.రాయలసీమ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసైనా కర్ణాటక నీటి దోపిడీని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
