ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని వేగవంతం చేసే దిశగా సీఎం ఈ పర్యటన చేపట్టారు.

ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోకముందే సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి, స్పిల్ వే, ఎగువ కాపర్ డ్యామ్ పనుల పురోగతిని వీక్షించారు. పోలవరం హెలిపాడ్ వద్ద సీఎంకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు స్వాగతం పలికారు.
వ్యూ పాయింట్ నుండి స్పిల్ వే నిర్మాణాలను పరిశీలించిన అనంతరం, కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. పనుల్లో జరుగుతున్న జాప్యం, సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చించారు.
