అమెరికాలో ప్రకృతి విలయం
నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్న సమయంలోనే.. అమెరికాలోనూ ప్రకృతి విలయతాండవం చేసింది.
ఆరిజోనా రాష్ట్రంలోని ప్రసిద్ధ గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లో ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక వరదలు కలకలం రేపాయి.
బ్రైట్ ఏంజెల్ క్రీక్ ప్రాంతంలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో 15 మంది పర్వతారోహకులు సహా 20 మందికి పైగా పర్యాటకులు గల్లంతయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొలరాడో నదిలోకి కొట్టుకుపోయిన వంతెనలు
నేషనల్ పార్క్ పరిధిలోని బ్రైట్ ఏంజెల్ కాన్యన్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతాలను ఆకస్మిక వరదలు తీవ్రంగా ముంచెత్తాయి.
శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో కొలరాడో నదిలోకి ప్రవహించే బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో వరద ప్రవాహం మొదలైంది.
వరద ఉధృతికి పెద్ద పెద్ద బండరాళ్లు, లోహపు నిర్మాణాలు, నడక దారుల్లోని ప్లాట్‌ఫారమ్‌లు, కాలినడక వంతెనలు కొలరాడో నదిలోకి కొట్టుకుపోయాయి.
వరద ప్రవాహంతో క్రీక్ మార్గం మరింత వెడల్పుగా మారి కొత్త నదీ ప్రవాహంలా కనిపించిందని నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు తెలిపారు.
ఆరిజోనా ప్రాంతంలోని లోయలు ఎంత వేగంగా మారిపోతాయో ఈ ఘటన చూపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు.
కేవలం 30 నిమిషాల్లో భారీ వర్షం
ఈ ఆకస్మిక వరదలకు భారీ వర్షపాతమే కారణమని నేషనల్ వెదర్ సర్వీస్ వాతావరణ నిపుణులు తెలిపారు.
ఎత్తైన పర్వత ప్రాంతంలో కేవలం 30 నిమిషాల్లోనే అర అంగుళం నుంచి ఒక అంగుళం వరకు తీవ్రమైన వర్షపాతం నమోదైంది.
ఆరిజోనా పర్వత శ్రేణులు తీవ్రమైన లోతును కలిగి ఉండటంతో వర్షపు నీరు మొత్తం నేలలోకి ఇంకలేదు.
దీంతో 6,000 అడుగుల ఎత్తు నుంచి నీరు ఒక్కసారిగా కొలరాడో నది వైపు దూసుకొచ్చింది.
ఆ సమయంలో అక్కడ క్యాంపింగ్ చేస్తున్న పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.
హెలికాప్టర్లతో 62 మంది సురక్షిత తరలింపు
సమాచారం అందుకున్న నేషనల్ పార్క్ సర్వీస్ సిబ్బంది, ఆరిజోనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
నది ఉప్పొంగడం, భవనాల శిథిలాలు ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని 50 మందికి పైగా పర్వతారోహకులు ప్రత్యక్షంగా చూశారని బాధితులు తెలిపారు.
భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి హెలికాప్టర్ల ద్వారా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఫాంటమ్ రాంచ్ ప్రాంతం నుంచి 62 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
పర్యాటక ప్రాంతాలు తాత్కాలికంగా మూసివేత
ప్రస్తుతం బ్రైట్ ఏంజెల్ క్యాంప్‌గ్రౌండ్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతంతో పాటు నార్త్ కైబాబ్ ట్రాక్ మార్గాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
కొలరాడో నదిలో బోటింగ్, రాఫ్టింగ్ కార్యకలాపాలను కూడా నిలిపివేశారు.
ఆరిజోనా ప్రాంతంలో సోమవారం వరకు మళ్లీ భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో కొండచరియలు విరిగిపడటం, కొత్తగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేషనల్ పార్క్ సర్వీస్ తెలిపింది.
గల్లంతైన పర్యాటకుల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.



