రూ.5కే మొబైల్ క్లాక్‌రూమ్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యల
తమిళనాడులోని ప్రసిద్ధ శైవ క్షేత్రం తిరువణ్ణామలై అన్నామలైయార్ (అరుణాచలం) దేవాలయానికి వెళ్లే భక్తులు ఇకపై కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 1, 2026 నుంచి ఆలయంలోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
ఫొటోలు, వీడియోలు, రీల్స్‌కు చెక్
ఆలయ ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటంతో పాటు గర్భగుడి పరిసరాల్లో ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరించకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
హిందూ మత, ధార్మిక దానాల శాఖ నిబంధనల ప్రకారం వీఐపీల ఫొటోగ్రఫీపై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలానికి గిరిప్రదక్షిణ, స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఈ నిబంధనలను తప్పనిసరిగా గమనించాలి.
ఐదు చోట్ల మొబైల్ భద్రతా కేంద్రాలు
భక్తులు తమ ఫోన్లను సురక్షితంగా భద్రపరుచుకునేందుకు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక మొబైల్ భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తూర్పు వైపు రాజగోపురం వద్ద రెండు కేంద్రాలు, ఉత్తర వైపు అమ్మని అమ్మన్ గోపురం వద్ద రెండు కేంద్రాలు, దక్షిణ వైపు తిరుమంజన గోపురం సమీపంలో ఒక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
రూ.5 చెల్లించి ఫోన్ డిపాజిట్
ప్రతి మొబైల్ ఫోన్‌కు రూ.5 రుసుము చెల్లించి టోకెన్ తీసుకోవచ్చు.
ఆ తర్వాత ఫోన్‌ను భద్రతా కేంద్రంలో డిపాజిట్ చేయాలి. దర్శనం పూర్తైన తర్వాత టోకెన్ చూపించి తిరిగి ఫోన్ తీసుకోవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
సీసీటీవీలతో నిరంతర నిఘా
ఆలయ ప్రాంగణంలో మొబైల్ వినియోగంపై సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి అనధికారికంగా ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్తే వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగిస్తామని ఆలయ యంత్రాంగం హెచ్చరించింది.
దర్శన సమయంలో భక్తులు ఏకాగ్రతతో ఉండేందుకు, ఆలయ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



