మత్స్యకార సోదరులకు సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని నక్కపల్లి మండలానికి రెండు భారీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మంజూరయ్యాయి.

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో రూ. 17.9 కోట్లు, దొండవాకలో రూ. 16.58 కోట్ల అంచనా వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లను ఆహ్వానించింది. నియోజకవర్గ మత్స్యకారుల చిరకాల వాంఛను గుర్తించిన మంత్రి అనిత, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ నిధులను మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సెంటర్లు అందుబాటులోకి వస్తే గంగపుత్రులు వేట ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు పడవలను లంగరు వేయడానికి, చేపల నిల్వ మరియు విక్రయాలకు అత్యాధునిక వసతులు లభిస్తాయి. తద్వారా స్థానికంగానే పుష్కలమైన ఉపాధి లభిస్తుందని మత్స్యకార సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
