అయోధ్య: రామాలయ విరాళాల పెట్టెల నుండి నగదు, బంగారు ఆభరణాల దొంగతనం కేసులో SIT విచారణను మరింత వేగవంతం చేసింది. ఆలయ ప్రాంగణంలో భద్రతా లోపాలను పరిశీలిస్తున్న సిట్‌కు, సీసీటీవీ ఫుటేజీని కావాలనే మార్చినట్లు కీలక ఆధారాలు లభించాయి. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
గడిచిన 11 నెలల్లో ఆలయ భద్రత కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఈ దొంగతనం జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీసీటీవీ కెమెరాల నిర్వహణ, నిఘా విభాగం మరియు గేట్-చెకింగ్ సిబ్బంది పాత్రపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్‌తో పాటు పలువురు ఉద్యోగులను సిట్ గంటల తరబడి విచారించింది.
బ్యాంక్ అధికారుల సమక్షంలో జరిగిన విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఏవైనా లోపాలు జరిగాయా? లోపల ఎవరైనా సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో విచారించాల్సిన 200 మంది జాబితాను సిట్ సిద్ధం చేయగా, ఇప్పటికే 125 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.



