ప్రభుత్వాలు ‘బడి బాట’ అని ప్రగల్భాలు పలుకుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నెల్లూరు జిల్లా రాపూరు మండలం గుడవోలు గ్రామంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల గత నాలుగు నెలలుగా ఉపాధ్యాయుడు లేక వెలవెలబోతోంది. తమ పిల్లల భవిష్యత్తు అంధకారమవుతోందని ఆగ్రహించిన తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో గత నాలుగు నెలలుగా ఒక్క టీచర్ కూడా లేరు. విద్యార్థులు ప్రతిరోజూ బడికి రావడం, మధ్యాహ్న భోజనం తిని ఏమీ నేర్చుకోకుండానే ఇంటికి వెళ్లడం నిత్యకృత్యమైంది. ఈ సమస్యపై పలుమార్లు మండల విద్యాశాఖ అధికారికి (MEO) విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామస్థులు విసిగిపోయారు. పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ దుగ్గునేటి కావేరి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు బడికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. “టీచర్ లేని బడి మాకెందుకు?” అంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. బీసీ కాలనీలోని నిరుపేద విద్యార్థుల చదువు అంటే అధికారులకు అలుసా అని బాధితులు మండిపడుతున్నారు. తక్షణమే ఉపాధ్యాయుడిని నియమించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
