బిహార్లో అసెంబ్లీ ఎన్నికల సమరానికి నేడు అధికారికంగా శ్రీకారం చుట్టబడింది. గురువారం ఉదయం 7 గంటలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 18 జిల్లాలకు చెందిన 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సుమారు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో ఎక్కువశాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో 10 లక్షలకు పైగా కొత్త ఓటర్లు ఓటు వేయబోతున్నారు.
తొలి విడతలో పార్టీలు ఇలా బరిలో ఉన్నాయి:
జేడీయూ – 57 స్థానాలు
బీజేపీ – 48
ఆర్జేడీ – 73
కాంగ్రెస్ – 24
ఎల్జేపీ – 14
సీపీఐ(ఎంఎల్) – 14
జనసురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్) – 119 అభ్యర్థులు
ప్రధాన నాయకుల్లో తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) రాఘోపుర్ నుంచి హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఇక బీజేపీ నేత సామ్రాట్ చౌధరీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
బిహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది – నవంబర్ 6 మరియు 11 తేదీల్లో. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. “పెహలే మత్దాన్, ఫిర్ జల్పాన్”(पहले मतदान, फिर जलपान)” అంటూ యువ ఓటర్లను ముందుగా ఓటు వేసి ఆ తర్వాతే రిఫ్రెష్ అవ్వాలని సూచించారు.

