విశాఖపట్నం: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం చనిపోయిన వ్యక్తిని, ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగడం అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. దేశం గర్వించే నాయకుల్లో వైఎస్సార్ ఒకరని, ఆయన పాదయాత్ర ముగిసిన రోజే ఇష్టానుసారంగా మాట్లాడటం సభ్యత కాదని హితవు పలికారు.
అచ్చెన్న మాటలు పచ్చి అబద్ధాలు! “వైఎస్సార్ మరణం వెనుక జగన్ ఉన్నాడని నేను అచ్చెన్నాయుడుతో అన్నట్లు తప్పుడు మాటలు మాట్లాడతారా? అంతకంటే నీచం మరొకటి ఉండదు. పదవుల కోసం ఇంత పచ్చి అబద్ధాలు ఆడాలా?” అని బొత్స ధ్వజమెత్తారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు తాను, తన భార్య క్యాంప్ ఆఫీస్ నుండి జగన్‌ను స్వయంగా తీసుకువచ్చామని, ఆ సమయంలో జరిగిన పరిస్థితులు తమకు తెలుసని గుర్తుచేశారు. వైఎస్ కుటుంబంతో తమకు విడదీయరాని సంబంధం ఉందని చెబుతూ ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
మావిగన్ చూసి వణుకు ఎందుకు? వైఎస్ జగన్ చేపట్టిన ‘మావిగన్’ (MAVIGUN) కార్యక్రమానికి వస్తున్న స్పందన చూసి కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదని బొత్స ఎద్దేవా చేశారు. “మావిగన్ అంటే ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారు? జనం నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే అచ్చెన్నాయుడు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు” అని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉండే ఆడవాళ్ల గురించి, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడటం ఆయన సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు.
అప్పులపై గవర్నర్‌కు ఫిర్యాదు: రాజకీయ విమర్శలే కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ, చట్టసభలకు తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. బడ్జెట్ గణాంకాల్లో వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను మోసగిస్తున్నారని, దీనిపై ఇప్పటికే తాను గవర్నర్‌కు లేఖ రాశానని వెల్లడించారు. ఆర్థిక శాఖ అధికారులు నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు లెక్కలు ఇస్తున్నారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని బొత్స డిమాండ్ చేశారు.
