యువ ఉద్యోగుల్లో పెరుగుతున్న కొత్త సమస్య
ఇటీవల 30 ఏళ్ల వయసులో ఉన్న యువ ప్రొఫెషనల్స్‌లో మతిమరుపు, ఏకాగ్రత తగ్గడం, మాట్లాడేటప్పుడు మాటలు మరిచిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక గదిలోకి వెళ్లిన తర్వాత ఎందుకు వచ్చామో గుర్తు లేకపోవడం కూడా చాలామందిని ఇబ్బంది పెడుతోంది. చాలా మంది దీనిని సాధారణ వర్క్ స్ట్రెస్‌గా భావిస్తారు. కానీ న్యూరాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ‘బ్రెయిన్ ఫాగ్’ లక్షణం కావచ్చు.
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి?
బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక ప్రత్యేకమైన వ్యాధి కాదు. ఇది కొన్ని మానసిక లక్షణాల సమూహం. ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, పనిపై దృష్టి నిలకడగా లేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కావడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. దీంతో రోజువారీ పనితీరు కూడా ప్రభావితమవుతుంది. సరైన కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఒత్తిడి ఒక్కటే కారణం కాదు
పని ఒత్తిడి బ్రెయిన్ ఫాగ్‌కు ఒక కారణం మాత్రమే. నిద్రలేమి, పోషకాహార లోపం, ఎక్కువసేపు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వినియోగించడం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి. కొన్నిసార్లు శరీరంలో దాగి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తాయి.
నిద్ర నాణ్యత చాలా ముఖ్యం
రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోయినా అది నాణ్యమైన నిద్ర కాకపోతే మెదడు పూర్తిగా విశ్రాంతి పొందదు. నిద్ర సమయంలో మెదడు తనలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించుకునే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే పగటిపూట అలసట, ఏకాగ్రత లోపం, మతిమరుపు వంటి సమస్యలు కనిపిస్తాయి.
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి సమస్యలు ఉన్నవారికి తెలియకుండానే నిద్ర పలుమార్లు భంగం కలుగుతుంది. దీంతో ఉదయం లేచినా పూర్తిగా విశ్రాంతి తీసుకున్న భావన ఉండదు.
పోషకాహార లోపం కూడా ప్రభావం చూపుతుంది
విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్ లోపాలు మెదడు పనితీరును మందగింపజేస్తాయి. ఈ పోషకాల లోపం వల్ల అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు రావచ్చు. అలాగే అదుపులో లేని మధుమేహం, థైరాయిడ్ సమస్యలు కూడా మానసిక అలసటకు కారణమవుతాయి.
డిజిటల్ ఓవర్‌లోడ్‌తో మెదడుపై భారం
ఆధునిక ఉద్యోగాల్లో నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు, గంటల తరబడి స్క్రీన్ ముందు గడపడం, ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల మెదడు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది.
పరిశోధనల ప్రకారం మెదడు ఒకేసారి రెండు పనులు చేయదు. ఒక పని నుంచి మరో పనికి వేగంగా మారుతూ పనిచేస్తుంది.
ఈ ప్రక్రియ ఎక్కువసేపు కొనసాగితే ఏకాగ్రత తగ్గి తప్పులు చేసే అవకాశం పెరుగుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా బ్రెయిన్ ఫాగ్‌కు కారణమవుతాయి. నిరంతర ఆందోళన వల్ల మెదడు విశ్రాంతి పొందదు. దీంతో ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం కష్టమవుతుంది.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
కొన్ని వారాల పాటు మతిమరుపు కొనసాగితే దానిని తేలికగా తీసుకోకూడదు. రోజువారీ పనులు చేయడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మతిమరుపుతో పాటు తలనొప్పి, చూపు మందగించడం, శరీరంలో బలహీనత, మాట్లాడటంలో ఇబ్బందులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా న్యూరాలజిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను కలవాలి.
బ్రెయిన్ ఫాగ్ నుంచి ఎలా బయటపడాలి?
ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని జీవనశైలి మార్పులు చాలా ఉపయోగపడతాయి. ప్రతిరోజూ తగినంత నాణ్యమైన నిద్ర తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చోకుండా మధ్య మధ్యలో విరామాలు తీసుకోవాలి.
ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వంటి అలవాట్లు పాటించడం కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రెయిన్ ఫాగ్‌ను ముందుగానే గుర్తిస్తే, దానికి కారణమైన ఆరోగ్య సమస్యను చికిత్స చేయడం ద్వారా పూర్తిగా నియంత్రించవచ్చు.
కాబట్టి మతిమరుపు లేదా ఏకాగ్రత సమస్యలను సాధారణ ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.



