మా చేపలు మాకే సొంతం..!!

March 30, 2026 5:27 PM

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని మత్స్య సంపద తమకే సొంతం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల మత్స్యకారులు ఇటువైపు రావద్దని హితవు పలికారు. ఈ విషయంలో తెలుగు వారికి తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు.  నాయుడుపేటలో ఇళ్ల పంపిణీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, పొరుగు రాష్ట్రాల జాలర్ల చొరబాట్లను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ విధానం వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యగా నెల్లూరు తీర ప్రాంత పరిరక్షణ కోసం రెండు ప్రత్యేక గస్తీ బోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అవసరమైతే మరో నాలుగు గస్తీ బోట్లను కూడా పంపించి తీర ప్రాంత నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యతను నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. “మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. మన మత్స్య సంపద మన మత్స్యకారులకే చెందాలి. తమిళనాడు, పుదుచ్చేరి నుంచి వచ్చి మన జలాల్లో చేపలు పట్టుకోవడానికి వీల్లేదు. వారిని ఇక్కడికి రానివ్వకుండా కట్టడి చేస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

గతంలో తీర ప్రాంత నిఘా కోసం తాము 20 బోట్లను ఏర్పాటు చేస్తే, వైసీపీ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందని, ఫలితంగా 12 బోట్లు నాశనమయ్యాయని ఆయన ఆరోపించారు. మత్స్యకారులకు అన్యాయం జరగకుండా చూడటం తన బాధ్యత అని పునరుద్ఘాటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media