అమరావతి ని శాశ్వత రాజధానిని చేశాం.. చరిత్ర పుటల్లో నిలిచిపోతాం..!!

April 3, 2026 4:07 PM

అమరావతి ఇక ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని వెల్లడించారు. అమరావతి లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. 2024 జూన్ 2 నుంచి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో పార్లమెంట్‌లో దాదాపు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని చంద్రబాబు వివరించారు. కొన్ని పార్టీలు నేరుగా మద్దతు పలకగా, మిగిలినవి కూడా సహకరించాయని తెలిపారు. ఇది ప్రజా రాజధానికి దక్కిన గౌరవమన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌తో పాటు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు, ఎంపీలకు ఐదు కోట్ల ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

వైసీపీ మీద చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దేశంలోని అన్ని పార్టీలు తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం అమరావతికి మద్దతుగా నిలిచాయని చంద్రబాబు అన్నారు. కానీ, ఈ రాష్ట్రంలో ఓట్లు వేయించుకుని గెలిచిన వైసీపీ మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసిందని తీవ్రంగా విమర్శించారు. “దేశమంతా ఒక దారి అయితే, వీళ్లది ఇంకో దారి అయ్యే పరిస్థితి వచ్చింది. దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు, మేమనుకున్నదే జరగాలని పట్టుదలతో ఉన్నారు. మేము అమరావతికి శాసనం చేస్తే, వాళ్లు దానిని నాశనం చేయాలనుకున్నారు” అని చంద్రబాబు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పరిస్తితులను చంద్రబాబు గుర్తుచేశారు. ఆ క్లిష్ట సమయంలో, తనకున్న అనుభవంతో ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేయడంతో, కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. అనంతరం, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, ప్రజాభిప్రాయం మేరకు విజయవాడ-గుంటూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని తెలిపారు. రైతుల త్యాగాలతో, ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన ల్యాండ్ పూలింగ్ ద్వారా 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని వివరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media