ఆంధ్రప్రదేశ్ లో చిన్న నగరాలకు సైతం రింగ్ రోడ్స్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించాలని ఆయన సూచించారు. రహదారులు-భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్వహణ, గుంతలు లేని రోడ్లు, ఈవీ బస్సుల వినియోగం, పోర్టు కారిడార్ల అభివృద్ధి వంటి కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ దిశగా చంద్రబాబు కొన్ని అంశాలు సూచించారు. రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఔటర్ కారిడార్ మోడల్స్‌ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. నగరాలకు రింగ్ రోడ్లు నిర్మించడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం అవుతాయని, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలను ఏపీతో అనుసంధానించేలా రహదారుల నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ అత్యంత పటిష్టంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45,433 కిలోమీటర్ల రోడ్లలో, ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోడ్లపై గుంతలు పడిన వెంటనే మరమ్మతులు చేపడితే సమస్యలు ఉండవని, ఇది నిరంతర ప్రక్రియగా సాగాలని సూచించారు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
రహదారుల నిర్మాణంలో నాణ్యతను పాటించాలని చంద్రబాబు సూచించారు. ఆ దిశగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
