ఎవరీ చంద్రనాథ్ రథ్.. మూడు రోజులు రెక్కీ చేసి మరీ చంపేసారా?

May 7, 2026 8:16 AM

పశ్చిమ బెంగాల్ లో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ (41) దారుణ హత్యకు గురయ్యారు.

తూర్పు మేదినీపుర్‌ జిల్లా చండీపూర్‌కు చెందిన చంద్రనాథ్ రథ్, సుమారు రెండు దశాబ్దాల పాటు భారత వాయుసేనలో సేవలందించారు. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత కార్పొరేట్ రంగంలో కొన్నాళ్లు పనిచేసి, ఆపై రాజకీయాల్లోకి వచ్చారు. సువేందు అధికారి అంతర్గత బృందంలో కీలక వ్యక్తి. చంద్రనాథ్ రథ్తల్లి గతంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున పంచాయతీ స్థాయిలో పదవి కూడా నిర్వహించారు. 2020లో సువేందు అధికారి బీజేపీలో చేరినప్పుడు, రథ్ కుటుంబం కూడా ఆయనతో పాటే పార్టీ మారింది. 2019 నుంచే చంద్రనాథ్ రథ్ అధికారికంగా సువేందు బృందంలో చేరి, తెరవెనుక కీలక వ్యూహకర్తగా మారారు. పార్టీ కార్యకర్తలతో సమన్వయం, ప్రచార కార్యక్రమాల నిర్వహణ, లాజిస్టిక్స్ వంటి సున్నితమైన బాధ్యతలను చూసుకునేవారు.

చంద్రనాథ్ రథ్ ను బుధవారం రాత్రి నార్త్ 24 పరగణాల జిల్లాలో దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. రెండు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చంద్రనాథ్ రథ్ తన స్కార్పియో వాహనంలో మధ్యమ్‌గ్రామ్‌లోని తన ఇంటికి బయలుదేరారు. డోల్తాలా ప్రాంతంలోకి రాగానే, వ్యూహాత్మకంగా ఓ చిన్న కారు ఆయన వాహనాన్ని అడ్డగించింది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు, రథ్ కూర్చున్న డ్రైవర్ పక్క సీటు వద్దకు వచ్చి, కారు అద్దం పైనుంచే అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపారు. ఛాతీ, పొత్తికడుపులో బుల్లెట్లు దిగడంతో రథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, దాడికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ కారుకు అమర్చిన నంబర్ ప్లేట్ నకిలీదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పోలీసులు హత్య కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media