ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుండి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించింది. గుజరాత్ టాపార్డర్ బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించగా.. చెన్నై బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల భారీ విజయంతో టాప్-2 లోకి చేరింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (64), సాయి సుదర్శన్ (84), జోస్ బట్లర్ (57*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. గుజరాత్ ఓపెనర్లు గిల్, సుదర్శన్ తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన గిల్ ఔటయ్యాక, సుదర్శన్ తన జోరు కొనసాగించాడు. సాయి సుదర్శన్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్ కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేసి గుజరాత్‌కు భారీ స్కోరు అందించాడు.
ఇక ఛేజింగ్ లో ఎక్కడా కూడా చెన్నై విజయం దిశగా సాగలేదు. 13.4 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. శివమ్ దూబే 17 బంతుల్లో 47 పరుగులు చేసి కాస్త ప్రతిఘటించాడు మినహా ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

