బాలీవుడ్ నటి,కల్కి 2898 ఏడి ఫేమ్ దిశా పటానీ తండ్రి జగదీశ్ పటానీకి బరేలీ జిల్లా యంత్రాంగం ఆయుధ లైసెన్స్ మంజూరు చేసింది. ఇటీవల వారి పూర్వీకుల ఇంటిపై గ్యాంగ్‌స్టర్లు దాడి చేయడంతో భద్రత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంది. జగదీశ్ పటానీ రిటైర్డ్ డీఎస్పీ కావడం ప్రత్యేకంగా గమనార్హం.
సెప్టెంబర్ 11–12 తేదీల్లో మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు ఆయన నివాసంపై 10 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడికి గోల్డీ బ్రార్, రోహిత్ గొడారా గ్యాంగ్‌కు చెందిన సభ్యులే కారణమని పోలీసులు గుర్తించారు. దాంతో జగదీశ్ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అన్ని లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ అవనీశ్ సింగ్, జగదీశ్ పటానీకి రివాల్వర్ లైసెన్స్ జారీ చేసినట్లు తెలిపారు. దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టగా, సెప్టెంబర్ 17న ఘజియాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు మట్టుపడ్డారు.

