సమస్య వచ్చినప్పుడు నీ కులం వాడే రాడు. డాక్టర్ కులం అడిగి ఇంజక్షన్ చేయించుకోం. ప్రాణం పోతుంటే నీళ్లు ఇచ్చేవాడి కులం చూడము” అని పేర్కొంటూ, అవసరాన్ని బట్టి కులాన్ని వాడుకోవడం సరికాదని ప్రముఖ కమెడియన్, రచయిత హైపర్ ఆది కులం, పరువు హత్యల అంశంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో ఆయన ఈ కీలక సామాజిక అంశాలపై సూటిగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

పరువు హత్యలపై స్పందిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు: “సంబంధాలకేమో వారి కులం వాళ్లు కావాలి. కానీ, అక్రమ సంబంధాలకు మాత్రం ఏ కులమైనా పర్లేదా? ఇది మనం బయట చూస్తున్నాం.” మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వారికి పెళ్లి చేయాలని, అబ్బాయికి పోషించే సామర్థ్యం ఉంటే అంగీకరించాలని సూచించారు. ఉద్యోగం లేకపోతే తెచ్చుకోమని చెప్పాలి కానీ, “ఒక్క నిమిషం ఆలోచిస్తే సరిపోయేదానికి హత్యలు ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు. హైపర్ ఆది చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి
