
రాజధానిలో బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి, విభజన కష్టాల నుంచి బయటపడటానికి ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని ధన్యవాదాలు తెలిపారు.
అమరావతిని అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే ఏడాదిన్నరలో దీనిని అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ నగరంగా తీర్చిదిద్దుతామని దృఢంగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో, క్వాంటం వ్యాలీ, ఏఐ ప్రాజెక్టుల కోసం అన్ని జిల్లాల్లో ఏఐ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

విజ్ఞాన రంగంలో పెద్ద అడుగులు వేస్తున్నాం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం గొప్ప పరిణామం. భవిష్యత్తులో అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియంను తప్పకుండా నిర్మిస్తాం.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రేర్ ఎర్త్ మినరల్స్ (REM) వంటి వ్యూహాత్మక రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, ఈ రంగంలో సమర్థవంతంగా పనిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
