రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించి, సామాజిక సాధికారత సాధించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో సంక్షేమ శాఖల కేటాయింపులపై జరిగిన చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.

రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గతంలో కంటే భారీగా నిధులు పెంచామని, ప్రతి పైసా ఆ వర్గాలకే ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం తగ్గించిన బీసీ రిజర్వేషన్లను మళ్లీ 34 శాతానికి పెంచుతామని, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీసీ రక్షణ చట్టం కోసం కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. కేవలం సంపద సృష్టిస్తే సరిపోదని, అది పేదలకు అందాలనే లక్ష్యంతో ‘పీ4’ (Public Private People Partnership) విధానాన్ని తెచ్చామన్నారు. లక్ష మంది మార్గదర్శులు 10 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం చేశామని, గిరిజనులకు లబ్ధి చేకూర్చే జీఓ నంబర్ 3పై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని ప్రకటించారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 3 లక్షల నుండి రూ. 54 లక్షలకు పెంచడమే లక్ష్యంగా ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌తో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు, సంజీవని పథకం ద్వారా పేదలను ఆదుకుంటామని సీఎం ఉద్ఘాటించారు.
