కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన గ్యాస్ లీకేజీ (బ్లో ఔట్) ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో మధురపూడి విమానాశ్రయంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ముఖ్యమంత్రిని కలిసి ప్రమాద వివరాలను వివరించారు. ఈ నెల 9న మండపేట పర్యటనకు రానున్న సీఎం చంద్రబాబు, ముందుగా బ్లో ఔట్ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి ఏరియల్ సర్వే నిర్వహిస్తారని ఎంపీ హరీష్ బాలయోగి వెల్లడించారు.

ప్రమాద నష్టాన్ని అంచనా వేసి బాధితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజల తరలింపుపై సీఎం అధికారులను ఆరా తీశారు.
