కుప్పం/చిత్తూరు: “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” (Speed of Doing Business) విధానంలో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) పరిధిలో పరిశ్రమల పురోగతిపై శనివారం ఆయన పారిశ్రామికవేత్తలతో కీలక సమీక్ష నిర్వహించారు. కుప్పంలో మొత్తం రూ. 7,684 కోట్ల పెట్టుబడితో 21 పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ద్వారా 35,545 మందికి ప్రత్యక్షంగా, మరో 44,584 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ఈ పర్యటనలో భాగంగా ఆరు కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఎంఓయూ చేసుకున్న ప్రతీ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి, గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని రకాల సహకారం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటం, చెన్నై-బెంగళూరు ఎక్స్ప్రెస్వే మరియు చిత్తూరు-కుప్పం రైలు మార్గాల వంటి మౌలిక వసతులు కుప్పంకు వరమని పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ కార్యకలాపాలు త్వరలోనే మొదలవుతాయని, గూగుల్ డేటా సెంటర్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయని వెల్లడించారు.
