క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ వ్యాధిని’నోటిఫైడ్ డిసీజ్’గా ప్రకటించిన ఏపీ, తాజాగా సమగ్ర ‘క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్’ను సిద్ధం చేసింది. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అట్లాస్‌ను ఆవిష్కరించారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, గ్రామ స్థాయి నుంచి సేకరించిన సమాచారంతో ఈ అట్లాస్‌ను రూపొందించారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఎక్కడ, ఏ రకమైన క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయో ఈ అట్లాస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల స్థానికంగానే చికిత్స అందించడం సులభతరమవుతుంది. 2030 నాటికి అడ్వాన్స్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించడం మరియు ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా ‘మిషన్ స్టేట్మెంట్’ రూపొందించారు. 23 బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల ద్వారా డే-కేర్ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ అందించేందుకు ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఏపీలో 32,657 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని, ముందస్తు పరీక్షల ద్వారా మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఈ సందర్భంగా వివరించారు.
