గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ప్రారంభించారు.

చీపురుపల్లి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు మరియు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించిన సీఎం.. అక్కడ వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన 14 ఏళ్ల లోపు విద్యార్థినులతో ముచ్చటించారు. వ్యాక్సినేషన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చని వారికి వివరించారు. సీఎం సమక్షంలో ఏఎన్ఎమ్లు విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ప్రాముఖ్యతను సీఎం స్వయంగా విద్యార్థినులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేశారు. ‘సంజీవని’ కార్యక్రమంలో భాగంగా ప్రతి వ్యాక్సినేషన్ వివరాలను డిజిటల్ హెల్త్ రికార్డుల్లో నమోదు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఈ వ్యాక్సినేషన్ ఒక మైలురాయి అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
