“గతంలో ఐటీతో సైబరాబాద్‌ను నిర్మించాం.. ఇప్పుడు ఏఐ (AI) మరియు క్వాంటమ్ టెక్నాలజీతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుడుతున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆయన ఏపీ అభివృద్ధికి సంబంధించిన పదేళ్ల ప్రణాళికను వివరించారు.

అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని ‘క్వాంటమ్ వ్యాలీ’గా మార్చబోతున్నట్లు సీఎం తెలిపారు. వినియోగదారులే విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారే ‘ప్రోజ్యూమర్’ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండటం గర్వకారణమని, సోలార్, విండ్ పవర్ ద్వారా పొల్యూషన్ లేని ఎనర్జీని అందిస్తామన్నారు. రాబోయే పదేళ్లలో గుంటూరు, విజయవాడ, మంగళగిరి కార్పొరేషన్లు కలిసిపోయి ఒక మెగా సిటీగా మారుతాయని, గుంటూరుకు 182 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందని వెల్లడించారు.

ప్రజల ఆరోగ్యం కోసం ‘సంజీవని’ ప్రాజెక్టును తెస్తున్నామని, దీనికి గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ ఏడాదిలోనే 28 జిల్లాల్లోని 72 లక్షల మంది హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తామన్నారు.
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుగా 2026లోనే డ్రోన్ అంబులెన్స్‌లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని సీఎం స్పష్టం చేశారు.
